మొన్నటిదాకా స్టార్ హీరోల సరసన ఆడిపాడి టాప్ చైర్ ఎంజాయ్ చేసిన హీరోయిన్ సమంతా తాజా లుక్స్ అభిమానులు టెన్షన్ పడేలా ఉన్నాయి. ఫెమినా కోసం జరిగిన ప్రత్యేక ఫోటో షూట్ నుంచి వచ్చిన స్టిల్స్ చూస్తే ఆనందానికి బదులు ఆందోళన కలిగించడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే లుక్స్ అలా ఉన్నాయి కాబట్టి. మొహం కాస్త పేలగా మారిపోయి జుత్తుని విరబోసుకుని ఇచ్చిన ఫోజు అంత కిక్ ఇచ్చేలా లేదని సగటు ప్రేక్షకుల అభిప్రాయం. గత ఏడాది విజయ్ దేవరకొండ ఖుషిలోనూ చలాకీగా కనిపించిన సామ్ కు హఠాత్తుగా ఏమైందని అందరూ అనుకోవడం సహజమే.

నిజానికి సమంతా కొత్త ఇన్నింగ్స్ ని ప్లాన్ చేసుకుంటోంది. త్వరలో వరుణ్ ధావన్ తో తను నటించిన సిటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలకు రెడీ అవుతోంది. దీని ప్రమోషన్ల కోసం మీడియా ముందుకు రావాల్సి ఉంటుంది. ఖుషి తర్వాత సామ్ కొత్త కమిట్ మెంట్లు ఇవ్వలేదు. ఒకటి రెండు ప్రతిపాదన స్టేజి దగ్గరే ఆగిపోయి మరొకటి చేతులు మారి వేరే హీరోయిన్ కి వెళ్లిందని ఇన్ సైడ్ టాక్. ఈ నేపథ్యంలో తిరిగి అవకాశాలు పట్టడం అంత సులభం కాదు. అందుకే ఇలాంటి ఫోటో షూట్ల ద్వారా దర్శక నిర్మాతలకు ఒక సందేశం పంపినట్టు అవుతుంది.

సమంతాకు గత రెండు సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. శాకుంతలం డిజాస్టర్ కాగా ఖుషి ఎబోవ్ యావరేజ్ దగ్గర ఆగిపోయింది. యశోద హిట్ ముద్ర వేయించుకోగా అంతకు ముందు కన్మణి కతిజా రాంబోతో పాటు జాను కూడా టపా కట్టాయి. పుష్పలో ఊ అంటావా ఊహు అంటావా ఐటెం సాంగ్ తో పెద్ద గుర్తింపైతే వచ్చింది కానీ అంతే మోతాదులో అవకాశాలు రాలేదు. ఆరోగ్యపరంగా తగిన చికిత్స తీసుకుని తిరిగి కోలుకున్న సామ్ మళ్ళీ వేగం పెంచే పనిలో ఉంది. సినిమాలు కాకపోయినా ఒప్పుకోవాలే కానీ ఫ్యామిలీ మ్యాన్ తరహాలో వెబ్ సిరీస్ ల ఆఫర్లకు లోటు ఉండకపోవచ్చు

By Ttimes

స్పందించండి